ప్రగతి భవన్ లో అలజడి మొదలైందని.. బీఆర్ఎస్ నిట్టనిలువునా చీలడం ఖాయమని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). మంత్రిగా ఉంటేనే భరించలేకపోతున్నామని.. ఇంకా సీఎం అయితే భరించగలమా అని ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ (KTR) అహంకారం, భాష తీరుతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు. మోడీ (Modi) ని టూరిస్ట్ అని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించిన ఆయన.. బీఆర్ఎస్ అభివృద్ధికి వ్యతిరేకమని మండిపడ్డారు.
తెలంగాణ (Telangana) సెంటిమెంట్ ను మళ్లీ రెచ్చగొడుతున్నారని ప్రజలు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసీఆర్ కనిపించి 15 రోజులైంది.. కేటీఆర్ పై అనుమానంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ నేతలు మోడీపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకుంటే నలుగురి పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పర్యటన తర్వాత బీఆర్ఎస్ లో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయని, కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబ ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా? వ్యాపారాలు లేనప్పుడు ఆస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని కోరడం కూడా విషం చిమ్మడం అవుతుందా అని నిలదీశారు బండి. ‘‘ప్రధాని మోడీనే చీటర్ అని అంటావా.. మీ తండ్రి పదవి కోసం నీ పేరునే అజయ్ రావు నుంచి తారక రామారావుగా మార్చాడు. మీ తండ్రిని మించిన చీటర్ ఎవరూ లేరు’’ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఏ కూటమి నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ప్రజలు బికారులు అవుతున్నారని, కేసీఆర్ కుటుంబం ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని అన్నారు బండి సంజయ్. దోచుకున్న సొమ్మును దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బతీసేందుకు వాడుతున్నారని విమర్శించారు. బీసీ ప్రధాని అయితే ఓర్చుకోలేకపోతున్నారని.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని వ్యతిరేకించిన చీటర్ కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ మీద బురద చల్లినట్టేనా? అని ప్రశ్నించారు. రబ్బర్ చెప్పుల కేటీఆర్ కి వేల కోట్లు ఎలా వచ్చాయి అంటూ నిలదీశారు.