జగన్మాత ఆశీస్సులు అందరికీపై ఉండాలని అన్నారు బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). దసరా పండుగ సందర్భంగా ఆయన కరీంనగర్ (Karimnagar) లో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు. ఇక, కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై స్పందిస్తూ.. కేసీఆర్ (KCR) సర్కార్ పై విమర్శల దాడి చేశారు.
కేసీఆర్ తీరుతో తెలంగాణ నవ్వుల పాలయిందన్నారు సంజయ్. ప్రాజెక్టు కుంగిపోవడం ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ సీఎం.. ప్రజా ధనాన్ని నాశనం చేశారని ఆరోపించారు. కేటీఆర్ (KTR) లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదన్న బండి.. ఆయనకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలన్నారు. అమెరికాలో చిప్పలు కడిగిన విషయం మరిచిపోయారా? అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ మాట్లాడేది ఓ భాషేనా? అంటూ ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే తమ పరువు పోయేదన్నారు బండి. గతంలో మోటార్లు మునిగిపోయాయి.. ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే డబ్బులు వసూలు చెయ్యాలన్నారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఎక్కడున్నా బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రధాన కారకుడు ముఖ్యమంత్రేనని అన్నారు సంజయ్. మాటలతో మాయ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఎక్కడకు వెళ్లినా కాళేశ్వరం నీళ్లతో కాళ్లు కడుగుతాం అంటూ అబద్ధాలు చెప్తున్నారని ఫైరయ్యారు. కానీ, ప్రాజెక్టు మిత్తికి మిత్తి కట్టలేని పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అనుభవం ఉన్న ఇంజనీర్లు, మంత్రులు ఉన్నారు కానీ.. కేసీఆర్ ఇంజనీర్లను వాళ్ల పని చేసుకోనివ్వరని విమర్శించారు. అలాగే, మంత్రులను కూడా వాళ్ల పని చేసుకోనివ్వడం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే స్పందించాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు బండి సంజయ్.