గత వారం రోజులుగా కేటీఆర్ (KTR) వ్యాఖ్యలు వింటుంటే భయమేస్తోందని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) అన్నారు. త్వరలో ప్రభుత్వం పడిపోతుందని… త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారని చెప్పారు. బహుశా ఆ వ్యాఖ్యలు నిజం కావచ్చన్నారు. ఎందుకంటే రేపు ఏపీలో, ఆ తర్వాత మహారాష్ట్రలో అనంతరం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆయా చోట్ల కేసీఆర్ను సీఎంగా చేయవచ్చని ఎద్దేవా చేశారు.
ఏ రాష్ట్రం నుంచైనా సీఎం అయ్యేందుకు కేసీఆర్కు అర్హత ఉందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ ఉందని అందువల్ల ఇక్కడ ఆ అవకాశం లేదని చెప్పారు. కేసీఆర్కు అంతలా సీఎం కావాలని ఉంటే వేరే రాష్ట్రానికి వెళ్లాలని హితవు పలికారు. కేసీఆర్ పేరు చెడగొట్టవద్దని కేటీఆర్కు బండ్ల గణేశ్ హితవు పలికారు. ముందు ముందు కాంగ్రెస్ చేసే పనులు చూసి మీరు అసూయపడే పరిస్థితులు వస్తాయన్నారు.
ఆ పరిస్థితులు చూసి మీరు ఆగం కావొద్దని… మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కేటీఆర్ ఉలిక్కి పడి నిద్ర పోకుండా ఆగమాగం అయిపోతున్నాడని అన్నారు. ఏదో కొంపలు మునిగిపోయినట్లు కేటీఆర్ భయపడుతున్నారని వెల్లడించారు.
ఎందుకు సార్.. ఎమ్మెల్యేలను మానసికంగా హింసిస్తున్నారని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టించి.. మీ స్క్రీప్ట్ రాసిచ్చి చదవండని చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. వారు ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాబట్టి వారి సమస్యలు సీఎంకు చెప్పుకోవద్దా సార్ అని అడిగారు. మనది ప్రజాస్వామ్యం కాదా? అని ప్రశ్నించారు. అంతగా బందించి మరి బర్రెను కట్టేసినట్లు కట్టేసి.. మీ చెప్పు చేతల్లోనే రాష్ట్ర ప్రజలు ఉండాలని అనుకుంటున్నారా అని ప్రశ్నలు సంధించారు.