సరస్వతీ అమ్మవారి జన్మదిన సందర్భంగా నిర్వహించే వసంత పంచమి(Vasantha panchami) ఉత్సవానికి బాసర ఆలయం(Basara Temple) సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు తెలంగాణతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
సుమారు 70వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అక్షరాభ్యాసం మండపాలను సైతం సిద్ధం చేశారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు బాసరకు భారీగా తరలి వచ్చారు. నిన్న సాయంత్రానికి ఆలయ అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. బాసరకు వచ్చే బస్సులు, రైళ్లు భక్తులతో కిటకిటలాడాయి. బాసర ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుందని ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు.
వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది. ఆలయం, గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాల దగ్గర అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.