బెంగళూరు (Bangalore) లో రైతు సంఘాలు ఈ రోజు బంద్ నిర్వహించాయి. తమిళనాడు (Tamilnadu) కు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరి వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు (Former Bodies) బంద్ కు పిలుపు నిచ్చాయి. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు.
నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తూ కన్నడ అనుకూల సంస్థల సమాఖ్య చైర్మన్ వటల్ నాగరాజు నేతృత్వంలో సుమారు 300 మంది నిరసనకారులు విధాన సౌధ నుంచి రాజ్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లారు. టౌన్ హాల్, రాజ్ భవన్ వద్ద ఫ్రీడమ్ పార్కులో నిరసనలు తెలపాలని నిరసనకారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
బంద్ నేపథ్యంలో బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు అర్బన్ జిల్లా కలెక్టర్ కేఏ దయానంద్ సెలవు ప్రకటించారు. నగరంలో క్యాబ్ లు ఎప్పటి లాగే నడిచాయి. బీఎంటీసీ, ఊబర్, ఓలా క్యాబ్ సర్వీసులు ఎప్పటిలాగే కొనసాగుతాయని ఓలా ఊబర్ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్షుడు తన్వీర్ పాషా నిన్ననే వెల్లడించారు.
బంద్ నేపథ్యంలో నగరంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా, దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. గూగుల్, వాల్ మార్ట్, ఐబీఎం లాంటి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించాయి.