ఆర్ఎస్ఎస్ (RSS) నేత దత్తాత్రేయ హోసబలే (Dattatreya Hosabale) కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా హిందూ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందూ సమాజం తన గొంతుకను సమర్థవంతంగా వినిపించేందుకు వివిధ హిందూ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కావాలని అన్నారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ హోసబాలే ప్రసంగిస్తూ.. కులం, ఉపకులం, వర్గం, గురువుల ప్రాతిపదికన ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు, సంస్థలు, ఫోరమ్‌లు ఏర్పడ్డాయని తెలిపారు. ఇవి ఒకరి పనికి మరొకరు హాని తలపెట్టే పనిలో ఉన్నాయని చెప్పారు.
ఈ వైవిధ్యమైన సంస్థల వల్ల హిందూ సమాజం నష్టపోయిందన్నారు. హిందూ సమాజం మన లక్ష్యాన్ని మరచిపోకూడదన్నారు. చాలా సార్లు హిందూ సమాజంలోని వైవిధ్యం కారణంగా చాలా చోట్ల విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలను అధిగమించేందుకు సంస్థల మధ్య సమన్వయం మెరుగవ్వాలని సూచించారు.
సమస్యలపై హిందూ సమాజం తమ గొంతును సమర్థంగా వినిపించాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్థలు తమలో తాము సమాచారాన్ని పంచుకోవాలి, మెరుగైన సమన్వయాన్ని ఏర్పరచుకోవాలని కోరారు. మతమార్పిడి, హిందువుల హక్కులను అణచివేయడం, పాశ్చాత్య ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలలో హిందూ అధ్యయనాలు, భారతీయ భాషల విభాగాలు లేకపోవడం వంటి కొన్ని సవాళ్లు ఉన్నాయన్నారు. వాటిని మెరుగైన సంస్థ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.