భద్రాచలం(Bhadrachalam)లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బుధవారం(రేపు) సీతారాముల కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామాలయం, పురవీధులు విద్యుత్ దీప కాంతులతో వెలుగుతున్న భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఏటా సీఎంతో పాటు మంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. అయితే ఎన్నికల నిబంధనల దృష్ట్యా ఈ సారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులెవరూ హాజరయ్యే అవకాశం లేకుండాపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. 60కౌంటర్లను ఏర్పాటు చేసి తలంబ్రాల పంపిణీకి అంతా సిద్ధం చేశారు.
అదేవిధంగా లడ్డూ, పులిహార కౌంటర్లు ఏర్పాటు చేశారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు పందిరితోపాటు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వేశారు. స్వామివారి కల్యాణోత్సవాలను వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లలో ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాల్లో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. https://bhadradrit emple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ప్రత్యక్ష ప్రసారానికి ఆటంకం
భద్రాచలం శ్రీ రామనవమి వేడుకలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈ సారి ఆటంకం ఏర్పడింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ఉన్నందున దేవదాయశాఖ ప్రత్యక్ష ప్రసారం లేదని స్పష్టం చేశారు. మిథిలా స్టేడియంలో మాత్రమే వీక్షకుల కోసం టీవీలు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరినా అధికారుల్లో సమన్వయ లోపంతో ప్రత్యక్ష ప్రసారానికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.