మొన్నటిదాకా కాంగ్రెస్ (Congress) నేతలను టార్గెట్ చేసిన ఐటీ (IT) అధికారులు.. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ (BRS) నేతలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy) సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు.. తాజాగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు (Nallamothu Bhaskar Rao)ను టార్గెట్ చేశారు. ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భాస్కర్ రావు మండిపడ్డారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవని.. తన దగ్గర డబ్బులు కూడా లేవని.. ఉన్నాయని నిరూపిస్తే మీకే ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. తన బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగలేదని తెలిపారు. అధికారులు ఎవరూ తనను కలవలేదన్నారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
రైస్ మిల్లర్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్న భాస్కర్ రావు.. వారితో తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 40 బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఇవి కొనసాగుతున్నాయి. నల్గొండలో 30 బృందాలు సోదాలు చేస్తున్నాయి. నల్లమోతు భాస్కర్ రావు ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్య అనుచరులు శ్రీధర్, ఆయన కుమారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం తన అనుచరులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరగడం లేదని చెబుతున్నారు.