వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఏపీ సర్కార్ (AP Govt) ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన చిన్న వీడియో ముందుగా బయటకొచ్చింది. తాజాగా మొత్తం స్పీచ్ కు సంబంధించిన వీడియో విడుదల చేయగా.. అందులో చిరు చాలానే మాట్లాడారు. సినిమా (Movie) వాళ్ల రెమ్యునరేషన్ గురించి పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారని.. వాళ్లకేం పనీపాటా లేదా? అని అన్నారు. సినిమా మీద సినిమా తీస్తున్నామంటే తమకు డబ్బులు వస్తాయని కాదు.. మా వాళ్లకు ఉపాధి లభిస్తుందని అని చెప్పారు.
చిరు (Chiru) వ్యాఖ్యలపై వైసీపీ (YCP) నేతలు వార్ కి దిగారు. వరుసబెట్టి మీడియా ముందుకొచ్చి మెగాస్టార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో భోళా శంకర్ (Bhola Shankar) సినిమాకు కష్టాలు తప్పవని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) ముందే అంచనా చేశారు. దానికి తగ్గట్టే.. భోళాశంకర్ మూవీ చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. ముందుగా ఏకే ఎంటర్ టైన్‌మెంట్ రూ.30 కోట్లు ఇవ్వాలని కోర్టులో డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ పిటిషన్ వేశారు. ‘భోళాశంకర్’ సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
డిస్ట్రిబ్యూటర్ అంశంపై చర్చ జరుగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం టికెట్ల పెంపుపై తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరించడంపై చిరు వ్యాఖ్యల ఎఫెక్టేనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగింది. అయితే.. ధరలు పెంచాలంటే నిర్మాణ వ్యయానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని స్పష్టం చేసింది జగన్ సర్కార్. బడ్జెట్ కనీసం రూ.100 కోట్లు దాటితేనే టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ.. రెమ్యునరేషన్ కాకుండా సినిమా కోసం రూ.101 కోట్లు ఖర్చు చేశామని బదులిచ్చింది.
బడ్జెట్ వ్యయంపై క్లారిటీ ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం సరైన డాక్యుమెంట్లను చిత్ర యూనిట్ అందించలేదని చెబుతోంది. దీంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని చిరంజీవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఓవర్ చేస్తోందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు, సినిమా టికెట్ల విషయంలో పారదర్శకంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సినిమా రంగంపై తమకు ఎలాంటి వివక్ష లేదని అన్నారు.