మధ్యప్రదేశ్ లోని టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దా జిల్లా సమీపంలోని మగర్ధ రోడ్డులో అక్రమంగా బాణసంచా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. ఇందులో తయారీకి ఉంచిన గన్ పౌడర్ కు ముందుగా మంటలు అంటుకుని తర్వాత పేలుడు జరిగింది. ఫ్యాక్టరీకి సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 87 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర పోలీసు బలగాలను మోహరించాయి. ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో బారికేడ్లు వేసి సామాన్య ప్రజల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
పేలుడు ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను ఆరా తీశారు. అగ్నిప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్ లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. “ఘటనాస్థలికి 50 అంబులెన్స్ లను పంపారు. మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, హోంగార్డ్ డీజీ అరవింద్ తో పాటు 400 మంది పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తాం. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందిస్తాం” అని సీఎం ప్రకటించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని హర్దా జిల్లా కలెక్టర్ రిషి గార్గ్ తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని స్థానిక యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు మరణించిన బాధిత కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.