బీజేపీ (BJP)పై చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ (Bupesh Bhagel) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘మహదేవ్ యాప్’స్కామ్ కేసులో కీలక నిందితుడు శుభం సోనీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. శుభం సోనిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు.
‘మహదేవ్ యాప్’స్కామ్‌కు సంబంధించి శుభం సోనీ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం భూపేశ్ బఘేల్ చేసిన సూచనల మేరకే తాను దుబాయ్ వెళ్లానని చెప్పారు. దుబాయ్‌లో గ్యాంబ్లింగ్ బిజినెస్ ప్రారంభించేలా సీఎం తనను ప్రోత్సహించారని పేర్కొన్నారు. భిలాయ్‌లో తన అనుచరుల అరెస్ట్‌కు సంబంధించి సీఎం బఘేల్ ను తాను సంప్రదించానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కమలం పార్టీపై సీఎం ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే ఈ సమయంలో ఇలాంటి వీడియోను బహిర్గతం చేశారన్నారు. ఈడీ సాయంతోనే ప్రస్తుతం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. ఈడీని ఉపయోగించి ఈ తతంగం సాగిస్తున్నారనే విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఈడీని వాడుకుంటున్నారని ఆరోపించారు. శుభం సోనిని తాను ఎప్పుడూ కలవలేదన్నారు. మహదేవ్ యాప్‌కు శుభం సోని యజమాని అంటూ రెండు రోజుల క్రితం ఈడీ ఓ ప్రకటన విడుదల చేసిందన్నారు. ఇది ఇలా వుంటే ఇటీవల శుభం సోని సంచలన ఆరోపణలు చేశారు.
తాను మహదేవ్ యాప్ యజమాని అని శుభం సోని చెప్పుకున్నాడు. 2021లో తాను ఈ యాప్‌ను ప్రారంభించానన్నారు. రెండేండ్లుగా ఈ యాప్ ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చత్తీస్ఘఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కు రూ. 508 కోట్లు చెల్లించానని అన్నారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.