చైనా అధ్యక్షడు జీ జిన్ పింగ్ (Xi Jinping) తో భేటీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్ పింగ్‌తో చర్చలు ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించడంలో చాలా సహాయపడుతాయని తెలిపారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య సైనిక చర్చలను పునరుద్దరించడం, పెంటానిల్ ను ఎదుర్కోవడం, కృత్రిమ మేధస్సుపై ఒప్పందాలను ఆయన ప్రశంసించారు.
పలు కీలకమైన అంశాల్లో సమాచార లోపాల వల్ల ఇరు దేశాల మధ్య అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఈ విషయంపై జిన్ పింగ్‌తో మాట్లాడే సామర్థ్యం తనకు ఉందని బైడెన్ తెలిపారు. ఇక జిన్ పింగ్‌ను నియంత అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అత్యంత నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు జరిగాయని బైడెన్ వెల్లడించారు.
భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య చర్చలను కొనసాగించనున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య సబంధాల పునరుద్దరణలో ఈ సమావేశం ద్వారా పురోగతి సాధించామని తెలిపారు. మరోవైపు బైడెన్ తో చర్చలపై డ్రాగన్ కంట్రీ కూడా స్పందించింది. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపింది. పలు అంశాలపై ఇరు దేశాల మధ్య లోతైన చర్చ జరిగిందని చెప్పింది.
మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చల సందర్బంగా తైవాన్ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో తైవాన్ చాలా కీలకమని జిన్ పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి సంబంధించిన కట్టుబాట్లను గౌరవించాలని జో బైడెన్ ను జిన్ పింగ్ కోరారు. తైవాన్ తో శాంతియుతమైన పునరేకీకరణ కావాలన్నారు. అదే సమయంలో బలవంతపు చర్యలను ఆయన తోసి పుచ్చలేదు.
ఇక తైవాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు తైవాన్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రజాస్వామిక పద్దతిని గౌరవించాలని జిన్ పింగ్ కు జో బైడెన్ సూచించారు. తైవాన్ కు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేకున్నప్పటికీ, ఆ దేశ సమీపంలో చైనా బలగాలను మోహరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.