బీజేపీ (BJP) పై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ తన శాసన సభ్యులు రమేశ్ బిదూరీ (Ramesh Bidhuri), నిషికాంత్ దూబేల (Nishikanth Dubey) ద్వారా వివాదాలను సృష్టించి కుల గణన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
న్యూ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించబోతోందన్నారు. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. రాజస్థాన్ లో తాము విజయానికి దగ్గరగా వున్నామని చెప్పారు. అక్కడ కూడా తాము గెలిచే అవకాశాలు వున్నాయని చెప్పారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చి విజయం సాధించాలని ప్రయత్నించిందన్నారు. ఇటీవల లోక్ సభలో బీఎస్పీ ఎంపీ డానీష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ముల్లా టెర్రరిస్టు అంటూ రమేష్ బిదూరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కలిశారు. రమేష్ బిదూరీపై చర్యలు తీసుకోకపోతే తాను తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ డానిష్ అలీ ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన్ని ఆ ఇద్దరు నేతలు కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.