– ఒక కులం కోసం, ప్రాంతీయత కోసం కాదు
– జనసేనకు అందరూ ఒక్కటే
– వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలి
– కులాలకు కేటాయించే నిధులు దారి మళ్లుతున్నాయి
– అధికారం చూడని వారికి ఇవ్వడమే నిజమైన సాధికారత
– పవన్ కళ్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
గత ఎన్నికల తర్వాత నుంచి ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటే.. ఇప్పుడు జనసేన (Janasena) ఇండిపెండెంట్ గా పోటీ చేసేదని అన్నారు ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). మంగళగిరిలోని కార్యాలయంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 నుంచే దళిత సంఘాలు, బీసీల నాయకులతో తిరిగానని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు పవన్. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని, అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డానని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. కులాలకు కేటాయించే నిధులు వాటికి వెళ్లడం లేదన్నారు.
అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు అనేవి ఒక్క కులం ఆధారంగా చేసుకుని ముందుకు సాగవని అన్నారు. ఇది తెలియకపోతే పార్టీని నడపలేమని చెప్పారు. ఏ ఐడియాలజీ అయినా దీర్ఘకాలికంగా పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. ‘‘తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ. రెండుసార్లు గెలిచిన పార్టీ. మూడో ఎన్నికకు వచ్చేసరికి బీఆర్ఎస్ గా మారింది. ఒక కులం కోసం, ఒక ప్రాంతీయత కోసం ఆడే ఆట చాలా చిన్నది. జనసేనకు అందరూ ఒక్కటే’’ అని తెలిపారు పవన్.
జనసేనలో చేరిన వైసీపీ నాయకులు
చిలకలపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణాజిల్లా వైసీపీ నేత
వై శ్రీనివాస్ రాజు, కడప జిల్లా వైసీపీ నాయకుడు
పొగిరి సురేష్ బాబు, శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత
చిక్కాల దొరబాబు, తూర్పుగోదావరి వైసీపీ నాయకుడు
దుగ్గన నాగరాజు, తూర్పుగోదావరి వైసీపీ నేత
కలగపాల్ పురుషోత్తం, తూర్పుగోదావరి వైసీపీ నాయకుడు
ఎదురువాక వెంకటగిరి, తూర్పుగోదావరి వైసీపీ నేత