ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో ఫేమస్ కావడానికి చాలా మంది చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఇటీవల ఓ ఆపరేషన్ థియేటర్(Operation Theater) లో సిబ్బంది రీల్స్ చేయగా అవి కాస్త వైరల్(Viral) అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించారు.
తాజాగా ఓ ఆస్పత్రిలో రోగులను గాలికొదిలేసి ఆపరేషన్ థియేటర్లో సిబ్బంది బర్త్ డే పార్టీ(Birthday Party) చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆపరేషన్ థియేటర్లో ఏకంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.
ఆస్పత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్లో ఆటపాటలతో పార్టీ చేసుకున్నారు. డీజే బాక్సులు పెట్టి గోల చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది బిర్యానీతో పాటు మద్యం సేవించినట్లు సమాచారం. అంతేకాదు ఆస్పత్రి ఎదుట భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
ఆపరేషన్ థియేటర్లో కేక్ కట్‌చేసి విందు భోజనాలు ఆరగించారు. ఇదంతా పార్టీలో ఉన్న సిబ్బంది తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. రోజూ వందలాది మంది పేషంట్లు వచ్చే ఆస్పత్రిలో బర్త్‌డే పార్టీ చేయడమేంటని నెటిజన్లు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.