కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP) 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంటే, కాంగ్రెస్ మాత్రం రూ. 400 కోట్ల కుంభకోణంలో కూరుకు పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ ఇంటిపై ఐటీ దాడుల్లో భారీగా డబ్బు కట్టలు పట్టుబడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజల నుంచి బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే కాంగ్రెస్ మాత్రం రూ. 400 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్నదంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
మొదటి నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ అవినీతి, కుంభకోణాల్లో ఇరుక్కుందన్నారు. రూ. 200 కోట్ల కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ ఆయన….. ఇలాంటి కుంభకోణాల వల్లే కాంగ్రెస్ ఎప్పుడూ ఈడీ, సీబీఐలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుందన్నారు. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకిస్తూ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో ఇటీవల భారీగా పట్టుబడిన అక్రమ నగదుపై కాంగ్రెస్ మౌనంగా ఉంటోందని ధ్వజమెత్తారు.
ఇప్పటికి నాలుగు రోజులు అవుతోందన్నారు. కానీ ఈ విషయంపై సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ స్పందించలేదన్నారు. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ, ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు చేసింది. తనిఖీల సమయంలో ఎంపీతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో భారీగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.