– ఈసారి బీజేపీ సర్కార్ ఖాయం
– బీసీ ముఖ్యమంత్రి పక్కా
– బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ ద్రోహులు
– 7న మోడీ సభకు అందరూ తరలి రావాలి
– కాంగ్రెస్ లో సీఎం కొట్లాట జరుగుతోంది
– కాళేశ్వరంపై చర్చకు సిద్ధం
– కేటీఆర్ వస్తారా? కేసీఆర్ వస్తారా?
– బండి సంజయ్ సవాల్
ముఖ్యమంత్రిని ముందుగానే ప్రకటించే సంస్కృతి బీజేపీ (BJP) లో లేదన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). ఆదివారం కరీంనగర్ (Karimnagar) లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామని.. బీసీ, ఎస్సీ, అగ్ర వర్ణాల పేదలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈనెల 7న బీసీ అత్మీయ గౌరవ సభ నిర్వహిస్తున్నామని… ప్రధాని మోడీ (PM Modi) హాజరు అవుతారన్నారు. స్వచ్ఛందంగా అందరూ తరలిరావాలని కోరారు.
సీఎం పదవిపై తనకు మోజు లేదని తేల్చి చెప్పారు సంజయ్. ఒకరు ఇద్దరు చెప్పినంత మాత్రాన తాను సీఎంను కాలేనని అన్నారు. తెలంగాణ (Telangana) లో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. సోమవారం కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నానని తెలిపారు. బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
క్షుద్ర పూజలు చేయడమే కాదు.. అప్పుడప్పుడు కట్టిన ప్రాజెక్టులు కూడా చూడాలని సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు బండి. మోటార్లు మునిగింది వాస్తవం.. ప్రాజెక్టు కుంగింది వాస్తవం.. పిల్లర్లకు పగుళ్లు వాస్తవమని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామని, కాళేశ్వరం కేసీఆర్ తాత ఆస్తి కాదని అన్నారు. ‘‘కేటీఆర్ నీ అయ్యను పట్టుకుని రా.. కాళేశ్వరం దగ్గరకు నిపుణులను పట్టుకుని రా.. నా సవాల్ కు సిద్ధమా’’ అంటూ విరుచుకుపడ్డారు. వాస్తవాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్న సంజయ్.. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి బలి పశువు కాక తప్పదన్నారు. తెలంగాణలో రేవంత్ ని ముఖ్యమంత్రిని చేయవద్దని ముస్లిం మత పెద్దలు రాహుల్ గాంధీని కలిశారని చెప్పారు. గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి పొగ అలుముకుందన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని వస్తోందన్నారు. కబ్జా రాయుళ్లు ఓడిపొతారని.. సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.