ఆర్మూర్ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి (Mla Paidi Rakesh reddY) భారీ షాక్ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు ఆయన వేసిన నామినేషన్ సందర్బంగా సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని హైకోర్టులో కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు.
రాకేశ్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించారన్నారు. హైదరాబాద్లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన గోడౌన్ గురించి అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఎన్నికల్లో ఉపయోగించిన ఐదు వాహనాలపై గతంలో విధించిన జరిమానాలు చెల్లించకుండానే వాడారని కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం పిటిషన్లో పేర్కొన్నారు.
దీనికి తోడు ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసుల వివరాలను రాకేశ్ రెడ్డి చూపించలేదని బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు సమాచారం.
2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి బీజేపీ పార్టీ నుంచి పైడి రాకేశ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్, మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నిలిచారు. కాగా, పైడి రాకేశ్ రెడ్డి ఎన్నికపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది.