– ప్రచారంలో మిథున్ రెడ్డి దూకుడు
– రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ…
– కేంద్రం ఇస్తున్న నిధులను వివరిస్తూ ప్రచారం
– శ్రీనివాస్ గౌడ్ పై అవినీతి ఆరోపణలు
– ఈసారి మహబూబ్ నగర్ గడ్డపై..
– బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమా?
మహబూబ్ నగర్ (Mahabubnagar) రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈసారి బీజేపీ (BJP) తరఫున బరిలో నిలిచిన ఏపీ మిథున్ రెడ్డి (AP Mithun Reddy) ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. ఇతర పార్టీల నేతల్లో అంతగా ప్రభావం చూపే వాళ్లు లేరని.. ఈసారి పక్కాగా బీజేపీ విజయం సాధిస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టే ప్రచారంలో ధూంధాం చేస్తున్నారు మిథున్ రెడ్డి. పాలమూరు అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని.. గ్రామాలకు కేంద్రం ఇస్తున్న నిధులను ప్రజలకు వివరిస్తున్నారు.
యువకుడు, ఉత్సాహవంతుడు కావడంతో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు మిథున్ రెడ్డి. 2009 నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించిన ఈయన… 2014లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు అంకితమయ్యారని.. పేదల బాధలు తెలుసుకుంటూ.. ప్రజల సమస్యలను గమనిస్తూ వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
తండ్రి జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాజకీయ అడుగులు వేసిన మిథున్ రెడ్డి.. అనతికాలంలోనే తానేంటో నిరూపించారు. పార్టీ తరఫున చేసిన ప్రతీ పనినీ సమర్ధవంతంగా నిర్వర్తించారని చెబుతున్నారు. హుజూర్ నగర్, నాగార్జునసాగర్ , దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు నియోజకవర్గాల ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సమయంలో నిరసన కార్యక్రమాలు చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. రైతులకు మద్దతుగా పోరాటాలు చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ధర్నాలు చేశారు. ఇలా.. అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ.. ప్రజా సమస్యలపై మిథున్ రెడ్డి పోరాటం చేశారని వివరిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.
పార్టీ బలోపేతం కోసం మిథున్ రెడ్డి పడుతున్న కష్టాన్ని గమనించిన హైకమాండ్ మహబూబ్ నగర్ స్థానం నుంచి ఈసారి బరిలోకి దింపింది. మహబూబ్ నగర్ లో బీజేపీకి పట్టుంది. గతంలో ఇక్కడి లోక్ సభ స్థానం నుంచి మిథున్ రెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇదే క్రమంలో గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు.. ఈసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారని.. మిథున్ రెడ్డి విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.