అసోం ముఖ్య మంత్రి హిమంత బిస్వ శర్మ ( Himantha Biswa Sharma) సంచలన వ్యాఖ్యలు చేశారు. మియా (బెంగాలీ మాట్లాడే ముస్లింలు) ప్రజలు బాల్య వివాహాల (Child Marriages)ను పక్కన బెట్టి తమను తాము సంస్కరించుకునేంత వరకు చార్ (Char) ప్రాంతంలోని ఆ వర్గం ఓట్లు (Votes) బీజేపీ (BJP)కి అవసరం లేదని అన్నారు.
అయినప్పటికీ వాళ్లు ప్రధాని మోడీకి, బీజేపీకి మద్దతు ఇస్తారని చెప్పారు. వాళ్లంతా బీజేపీకి ఓటు వేయకుండానే తమకు అనుకూల నినాదాలు చేస్తారని తెలిపారు. బీజేపీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. మియా ప్రజలంతా బీజేపీకి మద్దతు పలుకుతారన్నారు. కానీ వాళ్లు బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. తమకు మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
వాళ్లంతా హిమంత శర్మ, ప్రధాని మోడీ, బీజేపీకి జిందాబాద్ లు కొట్ట నివ్వండని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తమకు ఓటు వేయవద్దని మియా వర్గాన్ని తానే కోరతానని చెప్పారు. ఆ వర్గం ప్రజలు ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ పాటించి, బాల్య వివాహాలను మానుకున్న తర్వాతే తమకు వాళ్లు ఓట్లు వేయాలని చెప్పారు. ఇది నెర వేరాలంటూ సుమారు పదేండ్ల సమయం పడుతుందన్నారు.
అప్పటి వరకు మియా వర్గం ఓట్లు తాను అడగబోనన్నారు. పదేండ్ల తర్వాత అప్పుడు వాళ్ల ఓట్లను అడుగుతానన్నారు. తనకు, బీజేపీకి అనుకూలంగా ఓటు వేసే వారికి ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరాదన్నారు. తనకు ఓటు వేసే వాళ్ల ఖచ్చితంగా తమ కూతుళ్లను పాఠశాలలకు పంపాలని, బాల్య వివాహాలు చేయబోమని, ఛాందసవాదాన్ని వదిలి సూఫీ మతాన్ని అవలంభించిన వారై ఉండాలన్నారు.