ప్రధాని మోడీ (PM Modi) ఓ ‘చెడు శకునం’ (Bad Omen) అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుర్మార్గమైనవని బీజేపీ మండిపడుతోంది. దీన్ని వ్యక్తిత్వ హననంగా బీజేపీ అభివర్ణించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హస్తం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని కమలం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రధాని మోడీని ‘చెడు శకునం’అని, మోడీ ఒక జేబు దొంగ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. బిలియనీర్ల రుణాలను మాఫీ చేశారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో బీజేపీ ప్రస్తావించింది. బిలియనీర్లకు బీజేపీ సర్కార్ ఎలాంటి రుణ మాఫీ చేయలేదని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశం ప్రకారం బ్యాంకులు నిరర్ధక ఆస్తులకు సంబంధించి నిబంధనలు చేశాయని వెల్లడించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 123(4) (తప్పుడు ప్రకటనల ప్రచురణకు సంబంధించి అవినీతి పద్ధతులు అనుసరించడం), సెక్షన్లు 171జీ(ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు),
ఇండియన్ పీనల్ కోడ్ లోని 499 (పరువు నష్టం), ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఓ ‘చెడు శకునం’అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ అడుగు పెట్టడం వల్లే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా ఆటగాళ్లు దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారని, కానీ చెడు శకునం (మోడీ) వారిని ఓడిపోయేలా చేసిందన్నారు.