పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ఫేక్ వీడియోలు(Fake Videos) వ్యాప్తిపై కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Karimnagar mp candidate bandi Sanjay) తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ (Congress)పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయాలను చూసి దేశ ప్రజలు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మంగళవారం బండి సంజయ్ వేములవాడలో మీడియాతో మాట్లాడారు.
మే 8న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని వేములవాడలో జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బండి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యభర్తల మాటలు వెంటే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునే సత్తా లేక కాంగ్రెస్ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం అని అందుకే ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఈసారి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్నదని పేర్కొన్నారు.
పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుని అందుకే ఫేక్ వీడియాలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నదన్నారు. రిజర్వేషన్లను కల్పించిన అంబేడ్కర్‌ను ఓడించిందే కాంగ్రెస్ పార్టీ అని.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని రేవంత్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను బండి సంజయ్ ఖండించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని, దీని నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే బీజేపీ మీద బురదచల్లుతున్నారని బండి ఫైర్ అయ్యారు.