శేరిలింగం పల్లి (Sherlingam Palli) బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ (Ravi Kumar Yadav)పై నమోదైన హత్యాయత్నం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో పురోగతి గురించి వెల్లడించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి ఈ కేసుపై చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది జూన్ 16న శేరిలింగంపల్లి మండలంలో మజీద్ బండలో బీజేపీ నేత గజ్జెల యోగానంద్ ‘మీ సమస్య- మా పోరాటం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలామంది బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మజీద్ బండకు వెళ్లారు. అక్కడ వార్డు కార్యాలయం వద్దకు వెళ్లిన తమపై రవి యాదవ్ వర్గీయులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు.
తమ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రవి యాదవ్ పై మండిపడ్డారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రవి యాదవ్ తో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి అధికారుల బదిలీలు జరిగాయి. దీంతో కేసు అటకెక్కింది.
ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు నాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కేసు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదిలా వుంటే గతంలో కేసులు పెట్టిన వారిని రవి యాదవ్ తన అనుచరులతో అక్రమ కేసులు పెట్టిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.