ఈ ఏడాది డిసెంబర్‌లోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. మూడో సారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలనే అని ఆరోపించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రచారం కోసం బీజేపీ అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకొని పెట్టుకుందని ఆరోపించారు. ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనే.. ముందుగానే అన్ని హెలికాప్టర్లు బుక్ చేసుకుందని మండిపడ్డారు.
దేశంలో మూడోసారి బీజేపీ గద్దె ఎక్కితే నిరంకుశ పాలనేనని విమర్శించారు. ఇప్పటికే అన్నిపార్టీల్లో బీజేపీ చీలిక తీసుకొస్తోందన్న మమతా బెనర్జీ.. మరోసారి అధికారంలోకి వస్తే.. దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయని అన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బెంగాల్‌లో మూడు దశాబ్దాల సీపీఎం పాలనకు ముగింపు పలికామన్న దీదీ.. బీజేపీని కూడా రాష్ట్రంలో లేకుండా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.