ఢిల్లీ( Delhi)లోని ఆప్ (AAP) సర్కార్‌పై బీజేపీ (BJP) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారంటూ బీజేపీ విరుచుకు పడింది. కాలుష్య నియంత్రణపై ఆప్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తోందని, తద్వారా ప్రజల ప్రాణాలను హరిస్తోందని దుయ్యబట్టింది.
వాయు కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ఆప్ సీరియస్ గా లేదని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ మండిపడ్డారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కేవలం రెండు నెలల సమస్య కాదన్నారు. ఇది ఏడాది మొత్తం ఉండే సమస్య అని మండిపడ్డారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రోజుకో కారణాలు చెబుతోందన్నారు.
కాలుష్యంపై ఆప్ సర్కార్ కేవలం డిక్లరేషన్లు చేస్తోందన్నారు. ఈ విషయంలో ఆప్ చాలా సునాయాసంగా అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. పంట వ్యర్థాల దహనం చేస్తున్న 53 శాతం ఘటనలు పంజాబ్ లోనే నమోదవుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 26 వరకు 7136 పంట వ్యర్థాల దహనం కేసులు నమోదైతే అందులో 3,293 కేసులు పంజాబ్ నుంచే నమోదయ్యాయన్నారు.
ఇది ఇలా వుంటే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ సర్కార్ వద్ద ఎలాంటి విధానం లేదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో పంట వ్యర్ధాలను తగులబెట్టడం వల్లనే దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోతోందని ఆప్ 2020లో పేర్కొందన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యానికి కారణాలేంటనేది తెలియదని ఆప్ సర్కార్ చెబుతోందన్నారు.