దేశంలో వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. మొన్న బ్యాంకు(Bank)లకు బెదిరింపు మెయిల్స్ మరవక ముందే నిన్న పలు ఎయిర్ పోర్టు (Airport)లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. నిన్న రాత్రి 10.23 గంటల ప్రాంతంలో పలు ఎయిర్ పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. బెదిరంపు మెయిల్స్ నేపథ్యలో అధికారులు అలర్ట్ అయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయా విమానాశ్రయల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 7 విమానాశ్రయాలకు బెదిరింపులు వచ్చినట్టు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు బెదిరింపులు వచ్చినట్టు తెలిపాయి. విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేపట్టాయి.
తనిఖీల సమయంలో ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు ముంబైలోని పలు బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని 11 బ్యాంకుల్లో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఆర్బీఐకి అధికారిక మెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా ఈ మెయిల్ నుంచి బెదింరింపు మెయిల్స్ వచ్చాయి. ఆర్బీఐతో కలిసి పలు ప్రైవేట్ బ్యాంకులు భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని మెయిల్ లో పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ఆరోపించారు. దీంతో పోలీసులు పలు బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.