అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ (Hamas), రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Putin) ఒకటేనని ఆయన మండిపడ్డారు. అటు మిలిటెంట్లు, ఇటు పుతిన్ ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధాలను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
హమాస్ మిలిటెంట్ల, పుతిన్ ల బీభత్సం, దౌర్జన్యం వేరు వేరుగా ఉంటాయని చెప్పారు. కానీ వారి లక్ష్యం మాత్రం పొరుగు దేశాల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు కొనసాగితే త్వరలోనే అవి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధంతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు మద్దతు ఇచ్చే విషయంలో తాము ముందు ఉంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ కు అందించే సహాయ నిధులను పెంచాలని కాంగ్రెస్ సభ్యులను కోరామన్నారు. ప్రపంచంలో విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. హమాస్, పుతిన్ లాంటి ఉగ్ర శక్తులను విజయం అందకుండా చూస్తామన్నారు.
హమాస్, పుతిన్ లక్ష్యాలను అమెరికా ఎప్పుడూ అంగీకరించబోమని చెప్పారు. ఈ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచేందుకు అమెరికా ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. తమ భాగస్వాములే అమెరికాను పూర్తిగా సురక్షితంగా ఉంచడంలో సహాయం చేస్తారన్నారు. ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా తమ విలువలు ఉంటాయన్నారు.