సికింద్రాబాద్ (Secundrabad) రైల్వేస్టేషన్లో కిడ్నాప్ (Kidnap) అయిన ఐదేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. సైబర్ టవర్స్ వద్ద బాలుడిని విక్రయించేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించగా…పోలీసులు (Police) దాడి చేశారు. కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే బాలుడి ఆచూకీ కనుగొన్న జీఆర్పీ పోలీసులను అందరూ అభినందిస్తున్నారు.
నిన్న మెదక్ వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్ కు తండ్రి దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి వచ్చాడు. తండ్రి వాష్ రూంకి వెళ్లినప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ఆడుకుంటున్న ఐదేండ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. తన కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు కనిపించింది. బాలుడి కిడ్నాప్, అతడ్ని తీసుకెళ్లున్న దృశ్యాలు కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేప్టటారు.
కాగా, దుర్గేష్, అతని కుమారుడి కదలికలను గమనిస్తూ ఉన్న వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని ముందు పోలీసులు అంచనాకి వచ్చారు. ఈ నేపధ్యంలో బాలుడి కిడ్నాప్ వెనుక బెగ్గింగ్ మాఫియా ఉందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాలుడి విక్రయంపై సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు బాలుడిని అమ్ముతుండగా పోలీసులు ఆ ముఠాపై దాడి చేశారు. బాలుడు దొరికాడు కానీ, కిడ్నాప్ చేసిన దుండగులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.