విశాఖపట్నం(Vishakapatnam)లోని కొత్త గాజువాక(New Glass) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఆకాశ్ బైజూస్(Akash Baijus) విద్యాసంస్థలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇనిస్టిట్యూట్‌లోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భవనం మూడంతస్తులు ఉండగా రెండో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు అంతకంతకూ పెరిగి భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఈ భవనం వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. పక్కనే నివాసముంటున్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని వారు చెప్పారు. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదం జరిగిన భవనం లోపల ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో పాటు, అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లేందుకు సరైన దారి లేక మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందని వారు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.