ప్రముఖ నటుడు విజయకాంత్(71) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. విజయకాంత్‌ను బుధవారం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆయనకు కరోనా సోకిందని డీఎండీకే(DMDK) పార్టీ ఇవాళ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, శ్వాస సంబంధిత సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయకాంత్ కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కొవిడ్ తోడవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారి కన్నుమూసినట్లు తెలుస్తోంది.
విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్ ఫాన్స్, డీఎండీకే నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్ స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న అప్పటి చెన్నైలో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహం చేసుకున్నారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తాచాటారు.
తమిళనాడులో దేశీయ ముర్ఫొక్కు ద్రవిడ కఝగం పార్టీ చైర్మన్‌గా వ్యవహరించారు. విజయ్ కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015లో దేశీయ ముర్ఫోక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీ స్థాపించారు.
ఇక విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు తెలుగులో ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళంలో వందలాది సినిమాల్లో హీరోగా నటించారు. నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారు. విజయ్ కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.