Traffic Jam: గంటలో తాళి కట్టాల్సిన వరుడు ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు, అప్పుడు…ట్రాఫిక్ (Traffic) లో చిక్కుకుని ఆఫీసుకో, సినిమాకో, ఇంటికి చేరకోడానికో లేటు అవుతూ ఉంటాం. కానీ వరంగల్ (Warangal) లో ట్రాఫిక్ చిక్కుకుని పెళ్లికి ఆలస్యమయ్యాడు ఓ యువకుడు. అతడు పెళ్లికి వచ్చే అతిధుల్లో ఒకరు కాదు, అతడే పెళ్లికొడుకు (bridegroom). అసలేం జరిగిందంటే…
వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నుంచి తొర్రూరు బయల్దేరాడు. ఇంటి నుంచి ఉదయం 9 గంటలకే బయలుదేరాడు. పెళ్లి ముహుర్తం 10 గంటలకి. జాతీయ రహదారి కదా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెళ్లి మండపానికి చేరుకుంటామనే ధీమాతో పెళ్లికొడుకు హుషారుగా వెళ్తున్నాడు. ఇంతలో ఇల్లంద గ్రామ శివారుకు రాగానే అనుకోని ఘటన ఎదురైంది. హైవేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో…ట్రాఫిక్ జామ్ అయ్యింది.
పెళ్లి ముహూర్తం సమయానికి వెళ్తానో లేదా అని పెళ్లికొడుకు టెన్షన్ పడ్డాడు. వెంటనే స్వయంగా అతడే కారు దిగి ట్రాఫిక్ పోలీసులను కలిశాడు. త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ అధికారులను వేడుకున్నాడు. అప్పటికే అధికారులు మూడు క్రేన్ల సహాయంతో బోల్తా పడిన ట్యాంకరుని తొలగించే పనిలో ఉన్నారు. కొద్ది సేపట్లో క్లియర్ అవుతుందని పెళ్లికొడుక్కి చెప్పారు.
ఒకవైపు సమయం గడుస్తుండటంతో అసహనానికి గురైన పెళ్లికొడుకు వెనక్కి తిరిగి మరో మార్గంలో ప్రయాణించాడు. కానీ ఇంతలోనే ట్రాఫిక్ క్లియర్ అయ్యిందని తెలియడంతో, మళ్లీ అదే మార్గంలో వచ్చి పెళ్లి మండపానికి చేరుకున్నాడు. సమయానికి పెళ్లికొడుకు వస్తాడా, రాడా అని టెన్షన్ పడిన పెళ్లివారు పెళ్లికొడుకు రాకతో ఊపిరి పీల్చుకున్నారు.
పెళ్లికొడుకు దుస్తులతో ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల్ని రూట్ త్వరగా క్లియర్ చేయాలంటూ ప్రాధేయపడుతున్న సంఘటన్ని కొందరు వీడియోలు, ఫోటోలు తీశారు. వీటిని నెట్ లో పెట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.