రెజ్లర్ల (Wrestlers) పై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు కోర్టుకు సంచలన విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bushan Sharan Singh) లైంగిక వేధింపులకు గురి చేశారని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి తగిన ఆధారాలను తాము సేకరించామని పేర్కొన్నారు. అన్ని తెలిసే ఆయన ఈ పనులు చేశారని చెప్పారు.
ఈ సందర్బంగా తజకిస్తాన్‌లో జరిగిన ఘటన గురించి ఓ మహిళా రెజ్లర్ ఇచ్చిన ఫిర్యాదును కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. తజకిస్తాన్‌లో ఆసియా క్రీడల ఈవెంట్స్ జరిగిన సమయంలో ఆ మహిళా రెజ్లర్ ను బ్రిజ్ భూషణ్ తన గదికి పిలిపించుకున్నారని చెప్పారు. అక్కడ ఆమెను బ్రిజ్ భూషణ్ బలవంతంగా కౌగిలించుకున్నాడని తెలిపారు. దీంతో ఆయన చర్యను ఆ రెజ్లర్ వ్యతిరేకించిందన్నారు.
ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడన్నారు. తాను ఓ తండ్రి స్థానంలో వుండి ఆమెను కౌగిలించుకున్నానని చెప్పాడన్నారు. ఈ ఘటనలో బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ప్రశ్న కాదన్నారు. అదే సమయంలో మరో మహిళా రెజ్లర్ పట్ల కూడా బ్రిజ్ భూషణ్ అనుచితంగా ప్రవర్తించాడన్నారు.
తజకిస్తాన్ లోని ఓ హోటల్ లో తను చొక్కాను పైకెత్తి తనతో బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు చేసిందన్నారు.
ఈ ఘటనలను బట్టి చూస్తే బ్రిజ్ భూషణ్ అవగాహనతోనే పూర్తి స్పృహలో వుండే ఆ పనులు చేశారని పోలీసులు అన్నారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ బాలికతో పాటు మరో ఐదుగురు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత బాలిక ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో ఆయనపై పొక్సో కేసును ఎత్తి వేశారు.