బీఆర్ఎస్ పార్టీకి (BRS) మరో భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో ప్రస్తుతం కీలకనేతగా వ్యహరిస్తున్న ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు (K KeshavaRao) ఇంటికి కాసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ (Congress party state incharge deepadas munshi) మున్షీ వచ్చి వెళ్లారు. మున్షీ వెంట సీఎం రేవంత్ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.
వీరిద్దరి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సందర్భంగా కేకే, ఆయన కూతురు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా దీపాదాస్ మున్షీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ దీపాదాస్ మున్షీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం కేకేకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని గతంలో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. జనరల్ సెక్రటరీ పదవి అంటే ఆశామాషీ కాదు.కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటి స్థానం అని అన్నారు. అయితే, దీషాదాస్తో భేటీ అయ్యాక కేకే మనసు మార్చుకుంటారా? సొంత గూటికి చేరుతారా? అనేది త్వరలోనే తెలియనుంది.
ఇక ఆయన కూతురి విషయానికొస్తే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేకే విజ్ఞప్తి మేరకు విజయలక్ష్మికి బీఆర్ఎస్ అధినేత మేయర్గా అవకాశం ఇచ్చారు. మరి ఆ కృతజ్ఞతా భావంతో ఆమె ఉంటారా? రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారుతారా? అనేది కూడా త్వరలోనే తేలనుంది. కాగా, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.