ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు ఓ నాటకమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుబంధు (Rythu Bandhu) అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. రైతులను కాంగ్రెస్ సర్కార్ అవమానించిందని విమర్శలు గుప్పించారు. అందుకు బేషరతుగా రైతులకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో ఈ రోజు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…. చేవెళ్ల పార్లమెంట్ టికెట్‌ను మరోసారి రంజిత్ రెడ్డికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను మంత్రి కోరారు.
రైతుల వివరాలు మొత్తం వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఆ వివరాలు అన్నీ ఉన్నప్పటికీ రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధును అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రైతుబంధును ఆపింది కాంగ్రెస్ కాదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పి మరీ రైతుబంధు ఇచ్చేవాళ్లమని పేర్కొన్నారు.
ఢిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలే గుర్తుకువస్తారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామంటూ రైతులు వాపోతున్నారన్నారు. 11 విడతల రైతుబంధు చెల్లింపులను నిర్దిష్ట గడువులో చెల్లించామన్నారు. రైతుబంధు ఇస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్పై దృష్టిపెడితే ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు. మేధావులు రైతుల పక్షాన ఉంటారో లేదో తేల్చుకోవాలన్నారు.
వరి పండిస్తున్న ఒక్క రైతుకైనా రూ.1500 బోనస్ ఇచ్చారా అంటూ నిలదీశారు. రైతు రుణమాఫీ అన్నారని ఒక్కరికైనా మాఫీ చేశారా అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు పెరిగిపోయాయని నిప్పులు చెరిగారు. సన్నబియ్యం లేవు, ఉన్న బియ్యం రేటు పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలను ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు.