స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
తమకు ఎలాంటి కుళ్ళు లేదని, కడుపులో ఏం నొప్పి లేదని స్పష్టం చేశారు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టుగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తాము తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన రిక్రూట్ మెంట్లో ఉద్యోగాలు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్లకు ఇప్పుడు నియామక పత్రాల అందజేత పేరిట రేవంత్ రెడ్డి ఆర్భాటం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నియామక ప్రక్రియను చేపట్టినట్టు రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు అందజేశారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా అసలై వాస్తవాలు తెలుసని వెల్లడించారు.
తెల్లావారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు అనుకుంటే వాళ్ల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లారని ధ్వజమెత్తారు. గ్రూప్-1 గురించి రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఒక్క మాట లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ ఇచ్చిన హామీను నెరవేరిస్తే స్వాగతిస్తామని చెప్పారు. సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని సూచించారు. రోజూ అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు కనీసం కాంగ్రెస్ అధిష్టానం అయినా గడ్డి పెట్టాలని కోరారు.