మేడిగడ్డ (Medigadda)లో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ విచారణను ప్రభావితం చేసేలా మంత్రులు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఆ హామీలకు కావాల్సిన నిధులు సమీకరించలేక శ్వేత పత్రాలు, న్యాయ విచారణ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పలు చెరిగారు. శ్వేత పత్రాలు న్యాయ విచారణలను తాము స్వాగతిస్తున్నామని వెల్లడించారు. తామే విచారణలు కోరామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు మంత్రుల బృందం వెళ్లింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిందని తెలిపారు. ఈ పర్యటనలో అధికారులపై మంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు.
కానీ 93 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని పీపీటీలో వాళ్లే చెప్పారని తెలిపారు. కాళేశ్వరం కింద ఒక ఎకరం కూడా పార లేదని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరోపణలు చేసిందన్నారు. ఆ తర్వాత వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ అడగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అనడం సిగ్గు చేటన్నారు.
కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం హోదాలో తాను కూడా ప్రధాని మోడీని కలిసి కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని కోరామన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖలు రాశారని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా అడిగామన్నారు. ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెరగడంపై కాంగ్రెస్ నేతలు విచిత్రంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
దేశంలో అంచనాలు పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయా అని నిలదీశారు. పదే పదే ఆయకట్టు పెరగలేదంటున్నారని, అదే నిజమైతే తెలంగాణలో ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఎలా ఉత్పత్తి అవుతుందన్నారు. వరి ధాన్యం సేకరణకు చెల్లించిన డబ్బులు చూస్తే ఆయకట్టు పెరిగిందా లేదా అనే విషయం తెలుసి పోతుందని వెల్లడించారు.
తుమ్మిడిహట్టి దగ్గర తిరిగి ప్రాజెక్టు నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ అంటున్నారన్నారు. 2008 డిసెంబర్ 16 నాడు ప్రాణహితకు వైఎస్ శంఖుస్థాపన చేశారని గుర్తు చేశారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. అక్కడ నీటి లభ్యత లేదని కేంద్ర జల వనరుల సంఘం లేఖ కూడా రాసిందన్నారు. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ మేరకు ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని వివరించారు. దాదాపు 11 రకాల అనుమతులు తీసుకున్నాకే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారన్నారు.