బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లా రెడ్డి (Malla Reddy) ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో ఉన్నట్టుగానే తమ కుటుంబంలో కూడా మూడు పదవులు ఉండాలని తాను ఆశపడ్డాని తెలిపారు.
రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు తన కొడుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల కోసం చూస్తున్నామని, ఆయన ఆదేశిస్తే తన కొడుకు ఎన్నికల బరిలో దిగుతారని వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి లోక్సభ స్థానం టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి కన్ఫర్మేషన్ అయిందన్నారు.
చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నాడని ఆరోపించారు. అందుకే నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకుముందే, పట్నం మహేందర్ రెడ్డి వెళ్లి కూర్చున్నారని అన్నారు. ఎంపీ టికెట్ కోసమే రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డికి పొగుడుతున్నాడని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయ్యేందుకే జగ్గారెడ్డి తన పేరును ఎత్తుకున్నాడని ఆరోపించారు. తన పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని మల్లారెడ్డి వెల్లడించారు. తనకు గోవాలో హోటల్ ఉందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని స్పష్టం చేశారు.