కాంగ్రెస్ (congress)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైందంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి, కోదండరాం అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ హయాంలో లక్షన్నరకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తే ఆ విషయం జనానికి ఎక్కలేదని మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇస్తేనే కదా కాంగ్రెస్ 4వ తేది వరకు జీతాలు ఇచ్చిందన్నారు. జేఏసీ పేరిట బీఆర్ఎస్ పై కోదండ రామ్ అసత్య ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఎన్ని రోజుల గత బీఆర్ఎస్ సర్కార్ పై అబద్ధాలు చెబుతారు ? అంటూ ధ్వజమెత్తారు. మానికం ఠాగూర్ పై తాము సొంత ఆరోపణలు చేయలేదని వెల్లడించారు. కేవలం కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే తాము చెప్పామని అన్నారు. కేసీఆర్ హయాంలో లక్షా 60వేల ఉద్యోగాలు భర్తీ చేశారని వివరణ ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చామన్నారు. 42 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, ఇతర రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు అర్థం చేసుకోవాలని సూచించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నామని తెలిపారు