నామినేటెడ్ పదవితో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) ను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఆయన తగ్గడం లేదు. హాట్ కామెంట్స్ తో వార్తల్లో ఉంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు. కేశవనగర్ (Kesavanagar) గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే తాను స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదన్నారు.
డప్పు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారన్న రాజయ్య.. ఆఖరికి కోలాటమాడాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. అసలు, ఎందుకు అభద్రతా భావంలో ఉన్నారో అర్థం కావట్లేదన్నారు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని అన్నారు. స్టేషన్ ఘనపూర్ కు తానే సుప్రీం అని చెప్పారు రాజయ్య.
స్టేషన్ ఘనపూర్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇచ్చారు కేసీఆర్. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. బుజ్జగించేందుకు రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ గా ఇటీవల నియమించారు కేసీఆర్. అయినా కూడా టికెట్ తనకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు రాజయ్య. ఈ క్రమంలోనే హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు, ప్రచారంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు కడియం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు, వారిచ్చే హామీలకు గ్యారంటీ ఉంటుందా? అంటూ ఫైరయ్యారు.