ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలంటూ గతంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు(supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది.
కేసులో వాదనలు విన్న అనంతరం కేసు విచారణను ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. అదే రోజున కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
గతంలో కవిత పిటిషన్ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన న్యాయస్థానం తాజాగా ఆమె పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని వెల్లడించింది. ఆయా పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది.
ఇది ఇలా వుంటే తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్లో కవిత కోరారు. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సీఆర్పీసీ ప్రకారం ఆడవాళ్లను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని వెల్లడించారు. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు.