తమకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని బీఆర్ఎస్ (BRS)నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. చంద్రబాబు (Chandra Babu) , వైఎస్ హయాంలో ఎన్నో నిర్బంధాలను తెలంగాణ గడ్డ చూసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా మనది ఎప్పుడూ ప్రజాపక్షమే అని బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అన్నారు.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని చెప్పారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావన తీసుకు వస్తుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో గులాబీజెండా ఎగురవేసిన సైనికులకు హరీశ్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో భట్టిని నిలదీస్తే అసలు సమాధానం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 60 రోజులు పూర్తయ్యిందన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
గ్రామాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు మోసాలు చేసిందని ఫైర్ అయ్యారు. హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ఎగవేత, దాతవేట ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే హామీలపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోవాలన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని వెల్లడించారు. రూ.4వేల పింఛన్ ఇస్తామని ఊదరగొట్టారని.. కానీ ఉన్న రెండు వేల పెన్షన్‌ను కూడా కట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రూ.15వేలు ఇస్తామన్నారని తెలిపారు. కానీ ఉన్న రూ.10 వేలు పోయింది.. వేస్తామన్న రూ.15వేలకు కూడా దిక్కులేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా రైతుబంధు ఆగిందా అని ప్రశ్నించారు. మహాలక్ష్మీ పథకం ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మహాలక్ష్మీ ఇవ్వకుండా ఆడబిడ్డలను ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనన్నారు. లేదంటే కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.