బీఆర్ఎస్ (BRS) పాలనపై ఇటీవల కాంగ్రెస్ (Congress) సర్కార్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేసి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే శ్వేత పత్రానికి స్వేద పత్రంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, పాలనపై స్వేద పత్రం పేరిట ప్రజేంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు పార్టీ ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ భవన్‌లో రేపు ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారని ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ తొమ్మిదినరేండ్లలో పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా చాలా కష్టపడి, చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని కేటీఆర్ వెల్లడించారు.
కానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టతను దెబ్బతీస్తే సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించేందుకు జరిగే ప్రయత్నాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణను అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. అప్పులు కాదు రాష్ట్రం సృష్టించిన సంపదను ఆవిష్కరిస్తామన్నారు.