తమ బలం, బలగం కేసీఆర్ (KCR)అని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) అన్నారు. బీఆర్ఎస్ (BRS) ఓడిపోయినందుకు ప్రజలు బాధపడ్డారని తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని వెల్లడించారు. లోక్ సభ ఎన్నిక (lok sabha election)ల్లో బీఆర్ఎస్కు ఎదురుండదని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కే. కేశవరావు, హరీశ్ రావు, కడియం శ్రీహరి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారితో పటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య కేవలం 1.8 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పారు. రాబోయే లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీలో చర్చించుకుంటున్నామని వివరించారు.
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామని కార్యకర్తలకు ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే రైతుబంధు, రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.