కాంగ్రెస్ (Congress) అధికారం చేపట్టి నెల రోజుల కాక ముందే బీఆర్ఎస్ (BRS) విమర్శలు గుప్పిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ధరించిన చెప్పులపై బీఆర్ఎస్ మద్దతుదారులు ట్రోల్స్ చేస్తున్నారు.
గుచ్చి బ్రాండ్‌కు చెందిన చెప్పులను రేవంత్ రెడ్డి ధరించగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ చెప్పుల ఖరీదు రూ. 50 వేలు ఉంటుందని అంటున్నారు. రూ. 50వేల ఖరీదైన చెప్పులు వేసుకున్న రైతు బిడ్డ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ది దొరల పాలన అన్నారని గుర్తు చేస్తున్నారు.
ఆ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ రూ. 400ల చెప్పులను ధరించారని, కానీ ప్రజాపాలన అని చెబుతున్న సీఎం మాత్రం రూ. 50వేల చెప్పులు ధరించారని సెటైర్లు వేస్తున్నారు. ఖరీదైన చెప్పులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం అర్థమవుతాయని మండిపడుతున్నారు. ఈ ట్రోల్స్ కు అటు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
చివరకు ఖరీదైన చెప్పులు ధరించినా బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైతు బిడ్డ కవిత రూ. 20 లక్షల వాచ్ ధరిస్తే లేదు గానీ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి రూ. 50వేల చెప్పులు ధరిస్తే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. రైతులు ఖరీదైన బట్టలు, చెప్పులు ధరించ కూడదని బీఆర్ఎస్ అనుకుంటోందా అంటూ నిలదీస్తున్నారు.