అచ్చంపేట (Achampet) రణరంగం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తప్పు మీదంటే మీదని బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతలు తిట్టిపోసుకుంటున్నారు. హైదరాబాద్ (Hyderabad) అపోలో ఆసుపత్రిలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి బాలరాజు (Balaraju) డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు తన కాన్వాయ్ ను వెంబడించి దాడి చేశారని ఆరోపించారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ (Vamsi Krishna) రాయితో తనపై దాడి చేశాడన్నారు.
ఇటువంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు బాలరాజు. ప్రజలు తనతో ఉన్నారని.. వారి దీవెనల వల్లే బతికి బయటపడ్డానని తెలిపారు. పగ, ప్రతీకారాలు తమ సంస్కృతి కాదని.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ గూండాలు తనపై తన అనుచరులపై దాడి చేశారని ఆరోపించారు. చంపినంత పని చేశారన్నారు.
మరోవైపు, గువ్వల బాలరాజుపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ కృష్ణ. ఎన్నికల వేళ సానుభూతి కోసమే బాలరాజు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి పోయానని చెబుతోన్న ఎమ్మెల్యే.. కారు ఎలా నడిపారని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలు ఆడటం ఆయనకు కొత్తేమీ కాదని సెటైర్లు వేశారు.
శనివారం అర్ధరాత్రి అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని.. బాలరాజు డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో కారుపై రాళ్ల దాడి జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో బాలరాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తరవాత.. హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒకరిపై ఒకరు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు విమర్శలు చేసుకుంటున్నారు.