చక్రవర్తుల రాజగోపాల చారి (Chakravarthula Raja Gopala Chary)… గొప్ప స్వతంత్ర సమర యోధుడు. గొప్ప రాజనీతి వేత్త. గవర్నర్ జనరల్ (Governer general)గా నియమితులైన తొలి, ఏకైక భారతీయుడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అందుకున్న తొలి వ్యక్తి. గాంధీజీకి అంతరాత్మ రక్షకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి.
10 డిసెంబర్ 1878న తమిళనాడులోని సేలం జిల్లా దొరపల్లి అగ్రహారంలో సాంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో రాజాజీ జన్మించారు. తండ్రి చక్రవర్తి అయ్యంగార్, తల్లి సింగారమ్మ. ప్రాథమిక విద్య హోసూరు, ఉన్నత విద్య చెన్నై, బెంగళూరులో పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్‌లో పట్టా, 1899లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు.
న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. బాలగంగాధర్ తిలక్ నుంచి ప్రేరణ పొంది జాతీయ వాదిగా మారారు. 1919లో రౌలట్ చట్టాల వ్యతిరేక పోరాటంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీతో పాటు పాల్గొన్నారు.
ఆ తర్వాత కాలంలో గాంధీజీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. దీంతో ఆయన్ని గాంధీజీ అంతరాత్మ రక్షకుడు అనేవారు. ఆయన ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు. భారత్ కు తొలి భారతీయ గవర్నర్ జనరల్ గా ఆయన పని చేశారు. మద్రాస్ రాష్ట్రానికి తొలి సీఎంగా కూడా పని చేసిన ఘనత ఆయనది.