ఆరు గ్యారెంటీల (Six Guarantees) ను 40 రోజుల్లో ఎలా అమలు చేస్తారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongulet Srinivas Reddy) అన్నారు. తాము 40 రోజులు అని ఎప్పుడూ చెప్పలేదని, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైం పాస్ చేయబోమని తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ కమిటీకి భట్టి విక్రమార్క చైర్మన్, శ్రీధర్ బాబు, తనను నియమించారాని పేర్కొన్నారు. ప్రజా పాలనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో ఆరు గ్యారెంటీల అమలు విషయంపై చర్చించారు. నిజమైన లబ్ధిదారులకు అభయ హస్తం పథకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీల అమలుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. ప్రతి గ్రామం, తండా నుంచి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. కోటీ 25 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈనెల 30 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందని స్పష్టం చేశారు. 40 రోజుల్లో హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని.. తాము ఏనాడూ అలా చెప్పలేదని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. నిజమైన అర్హులను గుర్తించడమే తమ లక్ష్యమని.. ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.