కెనడా ( Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో భారత (India) ప్రమేయంపై ఆరోపణలు వున్నప్పటికీ ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు (Close Relations) నెలకొల్పేందుకు తాము కట్టుబడి వున్నామని చెప్పారు.
కెనడా దాని మిత్ర దేశాలు భారత్ తో పరస్పరం చర్చ కొనసాగించడం చాలా ముఖ్యమైనదిగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల కాలంలో భారత్ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. భౌగోలిక రాజకీయ అంశాల పరంగా భారత్ ఒక కీలక శక్తిగా వుందన్నారు. అందువల్ల భారత్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకునే విషయంలో తాము చాలా సీరియస్ గా వున్నామని వెల్లడించారు.
అదే సమయంలో చట్టబద్ధమైన దేశంగా నిజ్జర్ విషయంలో పూర్తి వాస్తవాలను వెలుగులోకి వచ్చేందుకు కెనడాతో భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై తాను బహిరంగంగా చేసిన ఆరోపణల గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో భేటీలో విషయాన్ని లేవనెత్తుతాని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తనకు హామీ ఇచ్చారని అన్నారు.
ఈ విషయంలో అమెరికా తమతోనే ఉందన్నారు. ఈ విషయంపై భారత్ తో అమెరికా చర్చిస్తోందని ఆయన వెల్లడించారు. దీన్ని ప్రజాస్వామ్య దేశాలు, చట్టాలను గౌరవించే అన్ని దేశాలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తో పాటు తమ భాగస్వామ్యులందరితో తాము చట్టబద్దంగా ఆలోచనాత్మకంగా, బాధ్యతాయుతమైన మార్గంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
భారత విదేశాంగ మంత్రి జై. శంకర్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఆంటోని బ్లింకన్ ల సమావేశం నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలు ప్రాధానత్యను సంతరించుకున్నాయి. ఇది ఇలా వుంటే ఈ నెల 18 న కెనడా పార్లమెంట్ లో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని తనకు నిఘా వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోందన్నారు.
ఈ నేపథ్యంలో భారత రాయబారిని బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. కెనడా వ్యాఖ్యల్లో నిజం లేదని, వాటిని ఖండిస్తున్నట్టు వెల్లడించింది. ప్రతిగా కెనడా రాయబారిని తాము బహిష్కరిస్తున్నట్టు చెప్పింది. ఐదు రోజుల్లో భారత్ విడిచి పెట్టి వెళ్లిపోవాలని కెనడా రాయబారిని భారత్ హెచ్చరించింది.