కెనడా (Canada) లోని ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని 41 మంది దౌత్య వేత్తలను ఉపసంహరించు కుంటున్నట్టు తెలిపింది. దౌత్య వేత్తలు భారత్ ను వీడి కెనడాకు చేరుకుంటున్నట్టు తెలిపింది. భారత్ (India) విధించిన డెడ్ లైన్ గడువు ముగియడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ప్రభుత్వం వెల్లడించింది.
కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. ఈ మేరకు కెనడాలో భారత దౌత్య వేత్తను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. వెంటనే కెనడాకు చెందిన దౌత్య వేత్తను బహిష్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఆయన భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
భారత్‌లోని 41 మంది దౌత్య వేత్తలను వెనక్కి పిలిపించాలని కెనడాకు భారత్ ప్రభుత్వం సూచించింది. దౌత్య వేత్తలను రీకాల్ చేసేందుకు కెనడాకు ఈ నెల 10 వరకు గడువు ఇచ్చింది. గడువు తీరిన తర్వాత వారి అధికారాలను రద్దు చేస్తామంటూ భారత్ హెచ్చరించిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా గడువు తీరడంతో కెనడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కెనడా ఎలాంటి ప్రతికార చర్యలు తీసుకోబోదని విదేశాంగ మంత్రి మెలానీ జోలి వెల్లడించారు. ఇప్పుడు బహిష్కరణకు గురైన కెనడా దౌత్యవేత్తలందరికీ గతంలో భారత్ మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. ఆ దౌత్యవేత్తలందరూ తమ విధులను చిత్తశుద్ధితో పని చేశారని అన్నారు. వారంతా రెండు దేశాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా పని చేశారని వెల్లడించారు.