భారత్ (India)లో కెనడా (Canada)కు చెందిన 41 మంది దౌత్య వేత్తలను ఆ దేశం ఇటీవల రీ కాల్ చేసింది. భారత్ హెచ్చరికల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకన్నట్టు కెనడా ప్రకటించింది. ఈ విషయంలో కెనడాకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్ వత్తాసు పలికాయి. ఇది ఇలావుంటే కెనడా దౌత్య వేత్తలు తమ అధికారాలను దుర్వినియోగం చేయడంతోనే భారత్ హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా చండీగఢ్, పంజాబ్లల్లో కెనడా కాన్స్యులేట్స్ తమ అధికారులను దుర్వినియోగం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీసాల జారీ విషయంలో కెనడా కాన్స్యులేట్స్ చూసీ చూడనట్టుగా వ్యవహరించాయని చెప్పాయి. ముఖ్యంగా వీసా దరఖాస్తు దారులకు నేర చరిత్ర ఉందని తెలిసినా వాళ్లకు వీసాలు జారీ చేశాయని తెలిపాయి. ఖలిస్తానీ ఉగ్రవాద ఉద్యమానికి కెనడా కాన్స్యులేట్స్ మద్దతు తెలిపాయని ఆరోపించాయి.
పలు సందర్భాల్లో వీసాల జారీ ప్రక్రియలో కెనడీయన్ అధికారులు ఉదాసీనతతో వ్యవహరించారని అన్నాయి. విచారణను ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్న పలువురిని కెనడాకు పంపేందుకు ఉద్దేశపూర్వకంగా వీసాలు జారీ చేశారని పేర్కొన్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు కెనడా సర్కార్ ఎలా మద్దతు ఇచ్చిందో భారత ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలు వున్నాయని అధికారి ఒకరు చెప్పారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కెనడాలోని ప్రవాస భారతీయులను ప్రేరేపించడం, భారత్లో జరుగుతున్న ఆందోళనలకు నిధులు సమకూర్చే అంశాల విషయంలో స్పష్టమైన సాక్ష్యాలు వున్నాయని చెప్పారు. ఆ సమయంలో కెనడా ప్రవాసీల నుంచి భారత్లోని వారి కుటుంబ సభ్యులకు వచ్చే నిధులు పది నుంచి ఇరవై రెట్లు పేర్కొన్నారు.
కెనడా అధికారులు పంజాబ్ ప్రభుత్వ అధికారులతో తరుచూ సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమావేశాల గురించి పలు మార్లు పంజాబ్ అధికారులు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు కూడా చేశారని అన్నారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమర్పించిన సాక్ష్యాలు, నివేదికలపై విస్తృతంగా చర్చించిన తర్వాత 41 మంది దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరిందని పేర్కొన్నారు.